– ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో పది మంది కమిషనర్లు
– ఇందులో సమస్యలపాలైన ఏడుగురు
– ఏసీబీ బారిన ఇద్దరు.. సస్పెన్షన్ బారిన ఒకరు
– మరొకరు కలెక్టరేట్ కు సరెండర్…
– విధుల్లో ఉండగా ఒకరి మృతి
– మరొకరిపై పోలీసు కేసు.. ఇంకొకరు అర్దాంతర బదిలీ
– ఇది బైంసా మున్సిపల్ కమిషనర్ల పరిస్థితి
బైంసా, (శ్రీకరం న్యూస్) ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్లకు కలిసి రావడం లేదు. కమిషనర్లుగా విధులు నిర్వహించిన వారు అవస్థలు పడక తప్పడం లేదు. ఏదో ఒక సమస్యతో ఇబ్బందుల పాలవుతున్నారు. గడిచిన ఏడేళ్ల కాల వ్యవధిలో ఇక్కడి మున్సిపాలిటికి ఏకంగా పదిమంది కమిషనర్లు మారారు. వీరిలో ముగ్గురి ఉద్యోగ కాలం సవ్యంగా సాఫీగా ముగిసింది. మిగతా ఏడుగురు కమిషనర్ల ఉద్యోగ కాలం సమస్యలు, వివాదాలు, కేసులు, సస్పెన్షన్లు, ఏసీబీ చిక్కడం, శాఖపరమైన చర్యల బారిన పడటం జరిగింది. 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పదిమంది అధికారులు కమిషనర్లుగా విధులు నిర్వహించగా, ఏడుగురు అవస్థల పాలవ్వడం గమనార్హం.
ఏడుగురికి ఏదో ఒక సమస్య…
భైంసా మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు నిర్వహించిన అధికారుల్లో ఇద్దరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంకొకరిని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు. మరో కమిషనర్ విధుల్లో ఉండగానే ఆనారోగ్యానికి గురై మృతి చెందారు. ఇంకొక అధికారి పోలీసు కేసులో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో అధికారి అర్ధాంతరంగా బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. ఇలా పదిమందిలో ఏడుగురు వివిధ కారణాలతో వార్తల్లో నిలవడం చర్చనియాంశంగా మారింది.
కమిషనర్ల పదవీ కాలం, పరిస్థితి ఇలా….
2019 డిసెంబరు 31న ఇక్కడి మున్సిపాలిటీకి కమిషనర్ గా ఎంఎ. ఖదీర్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో ఉండగానే ఆనారోగ్యం బారిన పడి 2021 సంవత్సరం ఫిబ్రవరి22న మృతి చెందాడు. ఆయన స్థానంలో ఎంఎ. ఆలీమ్ 2021 సంవత్సరం ఫిబ్రవరి 23న కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి 2022 నవంబరు 23 వరకు విధులు నిర్వహించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని బాన్సవాడ మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అయితే ఆయన ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో 19 మంది ఉద్యోగస్తులను నియమించిన ప్రక్రియలో చోటు చేసుకున్న వివాదంపై బదిలీ అనంతరం బాన్సువాడలో విధులు నిర్వహిస్తుండగా సస్పెషన్ వేటు పడింది. తదనంతరం ఏ. సంపత్ కుమార్ ఎఫ్ఎసీ కమిషనర్ గా 2022 నవంబరు 23 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు బాధ్యతలు నిర్వహించారు. అటు తరువాత ఏ. వెంకటేశ్వర్లు 2023 ఫిబ్రవరి 28 నుంచి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈయన విధుల్లో ఉండగానే రూ.30 వేలను పరోక్ష పద్ధతిలో లంచంగా స్వీకరించి 2024 మే 22న అవినీతి శాఖాధికారులకు పట్టుబడ్డారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో డిప్యూట్ ఎక్సూక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న సీహెచ్ సుదర్శన్ రెడ్డికి ఇంచార్జీ కమిషనర్ గా అధనపు బాధ్యతలు అప్పచెప్పారు. ఈయన 2024 మే 23 నుంచి 2024 ఆగస్టు 4 వరకు బాధ్యతలను నిర్వహించారు. అటు పిమ్మట రాజేష్ కుమార్ ఇక్కడి మున్సిపల్ కమిషనర్ గా 2024 ఆగస్టు 8 న బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో ఉండగా ఒక ఆస్తి మ్యూటేషన్‌కు సంబంధించి నెలకొన్న వివాదంలో పోలీసు కేసు బారిన పడ్డ ఆయన 2025 నవంబరు 11న ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయాడు. తదనంతరం బైంసా సబ్ కలెక్టర్ అజ్మేర సంకేత్ కుమార్ ఇక్కడి మున్సిపల్ కమిషనర్ గా 2025 నవంబరు 27 నుంచి 2026 మార్చి 6 వరకు అధనపు బాధ్యతలు చేపట్టారు. అనంతరం వై. నవీన్ 2026 మార్చి 7 నుంచి మే 2 వరకు కమిషనర్ గా విధులు చేపట్టారు. ఇదే సమయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో తీవ్ర వివాదాలు చెలరేగడంతో ఆయన ఆర్ధారంతరంగా బదిలీపై వెళ్లిపోయారు. ఈ క్రమంలో మామిడి పెల్లి లింగయ్య మే 2న కమిషనర్ గా బాధ్యలు చేపట్టారు. ఈయన మున్సిపల్ నిధులను ఆక్రమంగా ఇతర బ్యాంక్ ఖాతాలకు తరలించడం, విధులకు తరచూ గైర్హాజరవ్వడం, అందుబాటులో లేకుండా పోవడం, సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచడం తదితర కారణాలతో పాలకవర్గం జిల్లా కలెక్టర కార్యాలయానికి సరెండర్ చేసింది. సెప్టెంబరు 30న ఆయనను పాలక వర్గం కలెక్టర్ కు సరేండర్ చేసిన వెంటనే కార్యాలయంలో డిప్యూటీ ఎక్సుక్యూటివ్ ఇంజనీర్ నున్న జాదవ్ సంతోష్ కు ఇంచార్జీ కమిషనర్ ఆధనపు బాధ్యతలు అప్పచెప్పారు. అయితే మంగళవారం ఆయన ఒక కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించే విషయంలో రూ.50 వేలు లంచం నేరుగా తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖాధికారులకు నిర్మల్ లో పట్టుబడ్డారు. ప్రస్తుతం ఆయన స్థానంలో బైంసా ఎంపీడీవో నీరజ్ కుమార్ కు మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ అధనపు బాధ్యతలు అప్పచెప్పారు.
