– కాలం మారుతున్న .. మారని అలవాటు..
– 65 ఏళ్ల వయసులోనూ సైకిల్‌పైనే పూజారి రాకపోకలు
భైంసా (శ్రీకరం న్యూస్ ): కాలం మారుతోంది.. మనుషుల జీవనశైలిలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు సామాన్యుల ప్రయాణ సాధనంగా ఉన్న సైకిల్ స్థానంలో నేడు ద్విచక్ర వాహనాలు, కార్లు వచ్చి చేరాయి. కానీ ఆయన మాత్రం ఐదు దశాబ్దాలుగా సైకిల్‌నే తన నిత్య ప్రయాణ సాధనంగా చేసుకున్నారు. ఆయనే భైంసా పట్టణంలోని పురాణ బజార్‌కు చెందిన కామోల్కర్ లక్ష్మణరావు.
ప్రస్తుతం 65 ఏళ్ల వయసున్న కామోల్కర్ లక్ష్మణరావు రాజీవ్ నగర్‌లోని హనుమాన్ మందిరంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా సైకిల్‌ను వినియోగిస్తున్న ఆయన నిత్యం తన నివాసం నుంచి ఆలయానికి సైకిల్‌పైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే సత్యనారాయణ వ్రతాలు, ఇతర పూజలు, శుభకార్యాలకు సైతం సైకిల్‌పైనే వెళ్తుంటారు.
పట్టణ పరిధిలో ఎక్కడ పూజా కార్యక్రమాలు ఉన్నా తన సైకిల్‌పైనే వెళ్లడం ఆయనకు అలవాటుగా మారింది. సుదూర ప్రాంతాల్లో పూజలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు మాత్రం సంబంధిత కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్తే వారి వాహనంలో వెళ్తుంటారు. మిగతా సమయాల్లో మాత్రం సైకిల్ ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు.
ప్రస్తుతం చాలామంది ఆలయ అర్చకులు సైతం ఆధునికతకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుండగా..కామోల్కర్ లక్ష్మణరావు మాత్రం ఇప్పటికీ సైకిల్‌పైనే ప్రయాణించడం విశేషం. ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అలవాటు ఆయన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారింది. సైకిల్ ప్రయాణం వల్ల శారీరక శ్రమ లభించడంతో ఆరోగ్యంగా ఉండేందుకు కూడా దోహదపడుతోందని చెప్పవచ్చు.
ఆధునిక వాహనాలు అందుబాటులోకి వచ్చినా పాత అలవాటును వీడకుండా సైకిల్‌పైనే తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్న లక్ష్మణరావు పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వేగంగా పరుగులు తీస్తున్న నేటి సమాజంలో ఆయన సైకిల్ ప్రయాణం నిరాడంబర జీవనశైలికి, ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది.

