– గతంలో కమిషనర్.. తాజాగా ఇన్చార్జి కమిషనర్..
– ఏసీబీ వలకు ఇద్దరు
భైంసా ( శ్రీకరం న్యూస్ )
భైంసా మున్సిపాలిటీని అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో లంచాల వ్యవహారం మరోసారి వెలుగుచూడటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే కార్యాలయంలో కమిషనర్గా పనిచేసిన వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాజాగా ఇన్చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ సైతం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం కలకలం రేపుతోంది.
2024 మే 22 న అప్పటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పరోక్ష పద్దతిలో రూ 30 వేలు లంచం తీసుకోని ఏసీబీ వలకు చిక్కాడు.. ఈ ఘటన మరువకముందే తాజాగా ప్రస్తుత ఇన్చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ నేరుగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం.
ఒకే మున్సిపాలిటీలో పనిచేసిన ఇద్దరు కమిషనర్లు వేర్వేరు సందర్భాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం పట్టణ ప్రజల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం మున్సిపల్ పాలన తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వరుస ఏసీబీ ఘటనలతో భైంసా మున్సిపాలిటీ ప్రతిష్ఠ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
